తితిదే ప‌విత్ర‌తను బాబు దెబ్బ‌తీశారు ! జగన్ ప్రధాని మోదీకి లేఖ 2 m ago

featured-image

8కే న్యూస్‌, అమ‌రావ‌తి


తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారని, ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయన్నారు. ఇది భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తుంద‌న్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోయారని మండిప‌డ్డారు. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారన్నారు. 


ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే.....

ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని దుయ్య‌బ‌ట్టారు. దీంట్లో భాగంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు చేరిందని ఆరోపణలు చేశారన్నారు. తదుపరి కూడా ఆయన అత్యంత బాధ్యతా రాహిత్యంగా, అవాస్తవాలు చెప్పార‌ని వివ‌రించారు. కోట్లాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కేవలం రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు.


అస‌లేం జ‌రిగిందంటే....

కల్తీ జరిగిందని ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024, జూలై 12న తిరుమలకు వచ్చాయన్నారు. తిరస్కరించిన ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిపారు. శతాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారన్నారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబునాయుడుబాధ్యతా రాహిత్యంగా, వ్యాఖ్యలు చేశారన్నారు. అది కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు ఇది దారి తీసిందని తెలిపారు. 



అత్యుత్త‌మ విధానం....

ఆలయం అవసరాలకు సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు జరిపినా వాటి విషయంలో టీటీడీ దశాబ్దాలుగా అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోంద‌న్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయ వ్యవహారాలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టే చూస్తుందని వివ‌రించారు. ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉంటుందని తెలిపారు. ధర్మకర్తల మండలిలో భక్తులు, వేర్వేరు రంగాల్లో ఆథ్మాత్మికత నిండిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారన్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి వారిని టీటీడీ సభ్యులుగా సిఫార్సు చేస్తారని, ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారని గుర్తు చేశారు.


ఇ-టెండ‌ర్ ద్వారానే కొనుగోలు.....

ఆలయ అవసరాలకు అవసరమైన నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ ఇ–టెండర్‌ ప్రక్రియను అనుసరిస్తోందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్‌ పక్రియను చేపడుతుందన్నారు. టెండర్‌ పక్రియలో పేర్కొన్న నియమ, నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేసి ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారన్నారు. టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంద‌న్న ఆయ‌న‌ 2014–2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అదే పద్ధతి ఉందని తెలిపారు. నెయ్యిని వినియోగించే మందు దాని నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు కూడా ఉన్నాయన్నారు. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై ఎన్ ఏ బీ సీ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ మరియు కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాల్సి ఉంటుంద‌ని తెలిపారు. అలాగే ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్‌ నుండి మూడు నమూనాలను తీసుకుని పరీక్షిస్తారన్నారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. 

ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరని తెలిపారు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదని చెప్పారు.


తిర‌స్క‌రించిన వివ‌రాలు ఇలా..

2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హాయంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారని చెప్పారు. అలాగే 2019–24 మధ్య వైయస్సార్‌సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించడం జరిగిందన్నారు.  

అటువంటి ధృఢమైన విధానాలు మరియు పద్ధతులు అమలులో ఉన్నందున, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారీకి ఆస్కారమే లేదని స్ప‌ష్టం చేశారు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమలులో ఉందని తెలిపారు. 

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ట గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సామాజిక బాధ్యత లేకుండా చంద్రబాబు వ్యవహరించారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆతర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జులై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారని వివ‌రించారు. తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈఅంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారంటే చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతున్నాయన్నారు. కచ్చితంగా ఇది నేరమ‌ని గుర్తించాల‌ని కోరారు. 


సందేహాలు వ్య‌క్తం చేసిన ల్యాబ్‌

ఎన్ ఏ బీ సీ నుండి వచ్చిన నివేదికలో పేర్కొన్న ఎస్‌– విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండడంపై ల్యాబ్‌ కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేసిందని తెలిపారు. ఏయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు తప్పు కావచ్చనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొందన్నారు. తాము ఇచ్చిన రిజల్ట్స్‌ కొన్ని కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని కూడా అందులో పేర్కొన్నార‌న్నారు. పోషకాహార లోపం ఉన్న ఆవులనుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్‌ ఆయిల్స్‌ను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి వల్ల, వేర్వేరు విధానాలతో తీసే నమూనాల వల్ల కచ్చితత్వం లోపిస్తుందని నివేదికలో ఉందన్నారు. పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్‌ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొందన్నారు.

ఉదాహరణకు, పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్‌ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కొనుగొనేందుకు అవకాశాలు ఉండవని వెల్ల‌డించారు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదన్నారు.


కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా....

ప్రజా జీవితంలో తనకు అపారమైన అనుభవం ఉందంటూ పదేపదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ లాంటి సంస్థ యొక్క అంకిత భావాన్ని, పవిత్రతను, కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు అవకాశం ఉండే ఇలాంటి అంశాలపై తప్పుగా మాట్లాడకూడద‌న్నారు.

ఎన్‌డీడీబీ పరీక్షల నివేదికను ఈ లేఖకు జత చేస్తున్నాన‌ని, దానిని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మరొక అంశంలో కూడా టీడీపీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కో–ఆప్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిపేసిందని ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే ఇది పూర్తిగా సత్యదూరమ‌న్నారు. 2014–19 మధ్య టీటీడీ నిర్వహించిన టెండర్లలో కొన్ని సార్లు మాత్రమే టెండర్లలో పాల్గొంద‌ని వివ‌రించారు. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 2018 అక్టోబరు వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేయక పోయకపోవడం గమనార్హమ‌న్నారు. టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఎల్‌–1 ఆధారంగా ఎంపికైన ప్రైవేటు సంస్థలే నెయ్యి సరఫరా చేశాయని తెలిపారు. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్నిసార్లు కేఎంఎఫ్‌ ద్వారా నెయ్యి సరఫరా జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. 


నందిని విష‌యంలోనూ నిరాధార ఆరోప‌ణ‌లే....

నందిని విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమ‌న్నారు. నిజానికి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చేపట్టిన కొన్ని చర్యల పట్ల తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఆలయంలో వినియోగించే నేయి సహా సరుకుల స్వచ్ఛత, నాణ్యతలపై పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలను బలోపేతం చేశాని తెలిపారు.

ఈ విషయంలో ప్రఖ్యాత సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సేవలను టీటీడీ తీసుకుంద‌న్నారు. నవనీత సేవను ప్రారంభించడమే కాకుండా శుద్ధ నెయ్యి సరఫరా కోసం తిరుమలలో గోశాలను స్థాపించామ‌న్నారు. టీటీడీ అర్చకుల జీతాలు రెట్టింపు చేశామ‌ని, టీటీడీ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు అందించామ‌ని వివ‌రించారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జమ్మూలో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సమీపంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించామ‌న్నారు. 2023లో దీన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. ముంబై, రాయ్‌పూర్‌ మరియు అహ్మదాబాద్‌లలో బాలాజీ కొత్త ఆలయాల నిర్మాణం ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. 


చిత్త శుద్ధే లేదు...

చంద్రబాబునాయుడుకి చిత్తశుద్ధి లేని, కపట వైఖరిని చెప్పడానికి మరో అంశాన్ని ప్రస్తావించారు. 2024 జూలై 12వ తేదీన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్‌లోని నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, మూడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేకపోయాయని, వాటి నమూనాలను కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారన్నారు. తదుపరి ఆ నమూనాలను ఎన్ ఏ బీ సీ ల్యాబరేటరీకి జూలై 17, 2024న పంపారన్నారు. వాటిని పరిశీలించి, పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలను 23 జూలై, 2024న నివేదించారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకే అనుమతించ లేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలని కోరారు.


రాజ‌కీయ ఉద్దేశ్యాల‌తోనే అస‌త్య ప్ర‌చారాలు

ఏది ఏమైనప్పటికీ చంద్రబాబునాయుడు భక్తుల మనోభావాలను పూర్తిగా పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశాలతో అసత్యాలను ప్రచారం చేశారని తెలిపారు. దుర్మార్గపు ఉద్దేశాలతో వ్యవహరించారన్నారు. 2024 సెప్టెంబరు 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారని గుర్తుచేశారు. ట్యాంకర్‌ తిరస్కరించబడిన రెండు నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్‌ నివేదిక విడుదల చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కించపరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం మ‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్ వివ‌రించారు. చంద్రబాబు బాద్యతా రాహిత్య వైఖరితో ఇది స్పష్టంగా వెల్లడైందన్నారు. ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత రెండు నెలలపాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత, స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. రెండు నెలలపాటు మౌనంగా ఉన్నారని చెప్పారు. అందుకనే తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధమ‌న్నారు. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని తెలిపారు. 


రోజుకో అబ‌ద్ధం చెప్ప‌డం ఆయ‌కు అల‌వాటే....

చంద్రబాబు ఒక అబద్ధాల కోరని, అబ‌ద్ధాలు చెప్పడం అతనికి అలవాటన్నారు. కేవలం రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బ తీసేలా దిగజారారన్నారు. ఆయన చర్యలు నిజానికి ముఖ్యమంత్రి స్థాయిని మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీకి, టీటీడీ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని తెలిపారు. 


భ‌క్తుల సందేశాలు నివృత్తి చేయండి

ఇలాంటి కీలక సమయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోందన్నారు. అబద్ధాలను వ్యాప్తి చేసేలా సిగ్గు లేని రీతిలో నడుచుకున్న చంద్రబాబునాయుడును తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఉంద‌న్నారు. దీంతో పాటు నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావడం అత్యవసరమ‌ని కోరారు. కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో చంద్రబాబునాయుడు సృష్టించిన అనుమానాలను నివృతి చేయడంతో పాటు, ల‌డ్డూ ప్ర‌సాదం, ఆల‌యం పవిత్రతపై భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుందని కోరుతున్నాన‌ని జ‌గ‌న్ తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD